టీఆర్ఎస్ చూపు బీజేపీ వైపు..!

ఇప్పటివరకూ తెలుగుదేశం బీజేపీల మధ్య పొత్తు కుదరట్లేదనే వార్తలు వెలువడగానే టీఆర్ఎస్ బీజేపీకి సానుకూల సంకేతాలు పంపింది. దీంతో పొత్తులు పెట్టుకుని కలుస్తాయనుకున్న పార్టీలు ఒకరినొకరు విమర్శించుకుంటున్నాయి.మరోవైపు కలవడమంటూ ఉండదనుకున్న పార్టీలు ఇప్పుడు పొత్తుకోసం చర్చలు మొదలుపెడుతున్నాయి. పొత్తుల ఎత్తుల మధ్య కార్యకర్తలు తికమకపడుతుంటే..ఏ నాయకుడొచ్చి తమ టిక్కెట్ కు
టెండర్ పెడతాడోనని నేతలు మధనపడిపోతున్నారు.
    మొన్నటి వరకూ సీపీఐ టీఆర్ ఎస్ తో వెళ్తుందా..కాంగ్రెస్ తో వెళ్తుందా అనేది పెద్ద చర్చ. ఇక ఒక్కరోజు సిట్టింగ్ లో సీపీఐ నేత నారాయణ తమ దారి కాంగ్రెస్ తోనే అంటూ తేల్చేశారు.ఇక టీడీపీ..బీజేపీలు మళ్లీ పొత్తుపెట్టుకుందామని మాట్లాడుకున్న నేతలు సీట్ల సర్దుబాటు విషయంలో కొలిక్కిరాలేక పొత్తులేకుండా ఒంటరిగా పోటీచేస్తేనే మనకి మంచిదని రెండుపార్టీలూ భావిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వేస్తున్న ఆకర్ష్ మంత్రానికి..టీఆర్ ఎస్ కు ఎక్కడో గుండె గుబేల్ మంటోంది. టీఆర్ఎస్ లోని సీనియర్ నేతలకు కాంగ్రెస్ గాలం వేస్తున్నట్లు వార్తలు వస్తుండటంతో పార్టీలో అంతర్మథనం మొదలైంది. పైగా టీఆర్ ఎస్ కు క్షేత్రస్థాయిలో అంతగా కేడర్ లేకపోవడం, కాంగ్రెస్-సీపీఐ పొత్తు వంటి అంశాలు కూడా ఆపార్టీని ఒంటరిపోరుకు వెళ్లేందుకు భయపెడుతున్నాయి. ఒంటరిపోరుకన్నా ఏదో పార్టీతో పొత్తు పెట్టుకుని ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలనుకుంటోంది. అందుకే ఇప్పుడు దాని చూపులు బీజేపీ పై పడ్డాయి.
       ఇలా రోజుకో రకంగా పొత్తుల కాంబినేషన్లు మారిపోతుండటంతో... ఫలితాలను అంచనా వేసే విశ్లేషకులకు మతి పోతోంది. ఇన్ని రకాల పొత్తులు.. వాటితో వచ్చే టిక్కెట్ల చిక్కులతో ఎన్నికల్లో పోటీ ఎలా ఉంటుందోనని రాజకీయ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎవరెన్ని తంటాలు పడ్డా.. ఏ గందరగోళం లేని ఓటరు మహాశయుడు మాత్రం తాపీగా తన పని తాను చేసుకుపోతున్నాడు.
టీఆర్ఎస్ చూపు బీజేపీ వైపు..! టీఆర్ఎస్ చూపు బీజేపీ వైపు..! Reviewed by రాజాబాబు కంచర్ల on 2:41 AM Rating: 5

కామెంట్‌లు లేవు:

Facebook