కృష్ణా జిల్లా గన్నవరంలో తెలుగు తమ్ముళ్ల కథ..

కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీలో దాసరి సోదరుల ఆధిపత్యానికి అడ్డుకట్టపడిందని తెలుస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి గన్నవరంలో ఎదురులేని నాయకులుగా చలామణి అయిన దాసరి జైరమేష్ ఆయన సోదరుడు బాలవర్థనరావులను టీడీపీ అధినేత పక్కనపెట్టినట్లు ప్రచారం నడుస్తోంది. రాష్ట్ర రాజకీయ రాజధాని అయిన కృష్ణాజిల్లాలో ఎన్టీఆర్
హయాం నుంచి ప్రతి ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో చక్రం తిప్పిన పారిశ్రామికవేత్త దాసరి జైరమేష్, బాబుకు మధ్య గ్యాప్ పెరిగిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బాలవర్థనరావుకు గన్నవరం నుంచే కాకుండా ఇక ఎక్కడా టికెట్ దక్కే అవకాశం లేకపోవచ్చనే అనుమానాలు పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. గన్నవరం నియోజకవర్గానికి చెందిన దాసరి సోదరులు బాలవర్థనరావు, జైరమేష్‌లు 1994 నుంచి క్రియాశీలక రాజకీయాల్లో ఉంటూ వచ్చారు. తల్లిదండ్రుల పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేసి 1994 ఎన్నికల ముందు నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. దేవాలయాలు, ఇళ్ల నిర్మాణాలకు భూరి విరాళాలతో పాటు టీడీపీ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. అప్పటికే ఇక్కడ గద్దె రామ్మోహన్ పార్టీ కార్యక్రమాల్ని విస్తృతంగా చేపట్టారు. ఈ క్రమంలో అప్పటి ఎన్నికల్లో ఎన్టీఆర్‌కు, లక్ష్మీపార్వతికి అత్యంత సన్నిహితంగా ఉండే గద్దెను అభ్యర్థిగా ఖరారు చేయగా.. చివరి క్షణంలో సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఒత్తిడితో దాసరి సోదరులు టికెట్టును దక్కించుకున్నారు. దాంతో గద్దె ఎదురుతిరిగి రెబల్ అభ్యర్థిగా గెలుపొంది ఆ తర్వాత టీడీపీలో చేరారు. ఓటమి పొందిన చోటే గెలుపొందాలనే పట్టుదలతో దాసరి సోదరులు నియోజకవర్గంలో ఉంటూ 1999 ఎన్నికల్లో టికెట్ సాధించి గెలుపొందారు. 1999లో పార్టీ అధిష్టానం దాసరికి టికెట్టు ఇచ్చి గద్దెను విజయవాడ ఎంపీగా పంపింది. 2004లో కూడా పార్టీ దాసరి బాలవర్థనరావుకే టికెట్ ఇవ్వగా, అనూహ్యంగా కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ముద్దరబోయిన వెంకటేశ్వరరావుపై ఓడిపోయారు..
గన్నవరంపై దృష్టి పెట్టిన వంశీ
       
2009 ఎన్నికలకు రెండేళ్ల ముందు దాసరి తరహాలోనే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ యువకెరటంలా గన్నవరం రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన కూడా తల్లి పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేసి దాసరి సోదరులకు ధీటుగా సేవా, పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. 2009లో గన్నవరం టికెట్ ను ఆశించిన వంశీని చివరి క్షణంలో చంద్రబాబు విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పంపారు. గత ఎన్నికల్లో గన్నవరంలో దాసరి బాలవర్థనరావు గెలుపొందారు. 1999లో గద్దెను, 2009లో వంశీని విజయవాడకు పంపి నియోజకవర్గంలో తమ ఆధిపత్యాన్ని కాపాడుకున్న దాసరి సోదరులకు ఈసారి టీడీపీలో ఎదురుగాలి వీస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడ వెళ్లిన గద్దె అర్బన్‌లోనే తంటాలు పడుతుండగా, వంశీ మాత్రం తిరిగి గన్నవరం నియోజకవర్గంపై పూర్తిగా దృష్టిసారించి అధినేత ఆశీస్సులతో పలు సేవా కార్యక్రమాలు, పార్టీ పరమైన కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు.
వ్యాపారాలతో బిజీగా ఉన్న జైరమేష్‌
      
రానున్న ఎన్నికల్లో దాసరి వెంకట బాలవర్థనరావుకు టికెట్‌ గల్లంతేనని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. డాక్టర్ వంశీమోహన్‌కు దాదాపు టికెట్ ఖరారైందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. వంశీ కూడా తానే టీడీపీ అభ్యర్థినని ప్రచారం చేస్తుండటంతో అనుమానం బలపడుతోంది. దాసరి జైరమేష్ కూడా వ్యాపార లావాదేవీల్లో ఇతర దేశాల్లో ఉన్నారు. పార్టీకి ఎన్నో సేవలందించిన ఆయనకు ఇటీవల ప్రాధాన్యత తగ్గిందని తెలుస్తోంది. సీఎం రమేష్, కంభంపాటి రామ్మోహన్, సుజనాచౌదరి వంటి వారికి రాజ్యసభ సీట్లు కట్టబెట్టిన చంద్రబాబు జైరమేష్‌ను మాటవరుసకైనా రాజ్యసభకు వెళ్ళమని అడగలేదని దాసరి వర్గీయులలో నాటుకుపోయింది. ఈ క్రమంలో బాలవర్థనరావుకు కూడా నామినేటెడ్ పోస్టు ఇస్తామని చెప్పి పక్కన పెట్టే ప్రయత్నంలో చంద్రబాబు వ్యూహంగా ఉందని టీడీపీ శ్రేణులలో వ్యక్తమవుతోంది.
కృష్ణా జిల్లా గన్నవరంలో తెలుగు తమ్ముళ్ల కథ.. కృష్ణా జిల్లా గన్నవరంలో తెలుగు తమ్ముళ్ల కథ.. Reviewed by రాజాబాబు కంచర్ల on 2:58 AM Rating: 5

కామెంట్‌లు లేవు:

Facebook