ప్రముఖ కవి, రచయిత నందిని సిధారెడ్డికి ప్రతిష్టాత్మ కమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయన రచించిన ‘అనిమేష’ కవితా సంపుటికి ఈ పురస్కారాన్ని ప్రకటిస్తున్నట్లు అకాడమి తెలిపింది. కరోనా కాలంలో నెలకొన్న కష్టాలను, సామాజిక స్థితిగతులను, ప్రజల జీవనాన్ని అనిమేషలో సిధారెడ్డి కంటికి కట్టినట్టుగా కవిత్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమి తొలి ఛైర్మన్‌గా సిధారెడ్డి వ్యవహరించారు. అంతకుముందు మంజీరా రచయితల సంఘాన్ని స్థాపించి తెలుగు సాహిత్యాభివృద్దికి కృషి చేశారు. తన రచనల ద్వారా తెలంగాణ సంస్కృతిని ఆయన ప్రపంచానికి చాటి చెప్పారు. ఆధునిక తెలుగు కవిత్వంపై ఆయన ఎన్నో పరిశోధనలు చేశారు. సిధారెడ్డికి అత్యున్నత పురస్కారం లభించడం పట్ల రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు సాహితీవేత్తలు, రాజకీయ నాయకులు హర్షం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత జగన్ మోహన్‌రెడ్డి ఈ అవార్డు రెండు తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమని పేర్కొన్నారు.
సిధారెడ్డిని వరించిన అవార్డు ….
ప్రముఖ తెలుగు కవి నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు-2025 వరించింది. కరోనా కాలంలోని సామాజిక పరిస్థితులను వివరిస్తూ, ఆయన రాసిన ‘అనిమేష’ కవితా సంపుటికి గుర్తింపుగా ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు కేంద్ర సాహిత్య అకాడమీ పేర్కొంది. ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రముఖ తెలంగాణ కవి, రచయిత నందిని సిధారెడ్డి ని వరించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం రాష్ట్రానికే గర్వకారణమని బిఆర్‌ఎస్ నేత కెటిఆర్ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
“కడచూపు కాకపోయినా
కడకు నిప్పు పెట్టడానికి వీలు కాకపోయినా
కొడుకొచ్చాడు కడుపంత దుఃఖంతో..
అక్కలుంటారు తమ్ములుంటారు
భారంగా బంధువులుంటారు
ఎవరి మీదా పడి ఏడవటానికి ఉండదు”
కొవిడ్-19 కాలంలో ప్రపంచం అనుభవించిన దుఃఖాన్ని ‘అనిమేష’ కావ్యంగా రాసిన తెలంగాణ నాగేటి చాలు ‘నందిని సిధారెడ్డి’ గారికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ప్రకటించింది. అవార్డు ఎంపిక కమిటీలో డా.ఎన్.గోపి, డా.కోయి వెంకటేశ్వరరావు, డా.మధురాంతకం నరేంద్ర ఉన్నారు. కొవిడ్-19 దుఃఖాన్ని 19 గాథలుగా రాసిన ఆయన ఆర్తికి సముచితమైన పురస్కారం ఇది.
జీవిత విశేషాలు : నందిని సిధారెడ్డి తెలంగాణలో 1955 జూన్ 12న జన్మించారు. ఆయన తండ్రి నర్రా బాలసిద్ధారెడ్డి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్ట్ యోధుడు. తల్లి రత్నమాల. భార్య మల్లీశ్వరి. సిద్ధిపేటలో పాఠశాల విద్యను పూర్తి చేసి, హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలుగు సాహిత్యంలో ఎం.ఏ, ఎం.ఫిల్, పీహెచ్‌డీ చేశారు. తరువాత మెదక్, సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో తెలుగు లెక్చరర్ గా పనిచేశారు. 2012లో పదవీ విరమణ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017లో ప్రభుత్వం ఆయనను తెలంగాణ సాహిత్య అకాడమీకి మొదటి ఛైర్మన్ గా నియమించింది. 1997లో ‘నాగేటి చాల్లల్ల’ అనే కవిత తెలంగాణ సంస్కఅతికి ప్రతిరూపంగా నిలిచింది. ఆయన భూమిస్వప్నం, ఇగురం, ఆవర్థనం, కుల వృత్తులు, ప్రాణహిత వంటి అనేక రచనలు చేశారు. తాజాగా ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు-2025 వరించింది. అంతకు ముందు నాగేటి చాల్లల్ల అనే పాటకు ఉత్తమ గేయరచయితగా నంది అవార్డు (2010) వచ్చింది. 2001లో ప్రాణహిత కవితా సంకలనానికి తెలుగు విశ్వవిద్యాలయం వారు పురస్కారం అందించారు. 1988లో దాశరథి పురస్కారం లభించింది.
0 కామెంట్‌లు